Showing posts with label యుద్ధం. Show all posts
Showing posts with label యుద్ధం. Show all posts

Monday, 12 January 2015

యుద్ధం 1

యుద్ధం మానవ జాతికి ఆకలి, నిద్ర, సంభోగం అంతటి పాత మిత్రుడు. నిజమే మిత్రుడే. నిత్యం మనం ఉన్నది యుద్ధరంగమేనని, చేస్తున్న ప్రతి పనిలోనూ యుద్ధానికి సంబంధించిన ఏదోక కోణముంటుందని చాలామందే తాత్త్వికులు ఘోషిస్తూన్నారు. భగవంతుడనిపించుకున్న కృష్ణుడు మొదలుకొని నిన్నమొన్నటి రాబర్ట్ గ్రీన్ వరకూ ఎందరెందరో చెప్పేది ‘‘యుద్ధం చేయడం మంచికే’’. అయితే మొదటి రెండు ప్రపంచయుద్ధాల కాలంలో జీవించిన మరికొందరు మాత్రం యుద్ధంలో చివరకు ఓడేది మానవత్వమేనంటారు. ఈ రెండు రకాల వారూ యుద్ధాన్ని గురించి పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నారనిపించినా వారు యుద్ధం అన్నది మాత్రం వేర్వేరు విషయాల్ని కావచ్చు. ఏదేమైనా ఆ యుద్ధాన్ని గురించి, పోరాటాన్ని గురించి తెలుగు సినిమాలూ పుస్తకాలూ ప్రముఖులూ చెప్పేదేంటో చూడండి.
  • "ఇదొక విషపూరితమైన ప్రపంచం; ఈ స్థితిలో యుద్ధంచేయకుండా మడికట్టుకు కూర్చుందామని యెవ్వడూ ప్రయత్నించి ఏమీ లాభంలేదు. యుద్ధానికి దిగటం, దిగకపోవటం, మన చేతిలో లేదు. దాక్కుందామన్నా అది యేదోరూపంలో మన నెత్తిమీదికి రానే వస్తుంది. మన స్వప్రయోజనం మనం ఆలోచించుకుని తొందరపడి వీలైన పద్ధతిని రంగంలోకి ఉరకలేకపోతే, ఆనక పరాయివాడి బానిసలుగా యితరుల ప్రయోజనాల కోసం, ఇతరుల చెప్పుచేతల్లో రణరంగానికి నడవవలసిన స్థితి ఏర్పడుతుంది. ప్రపంచంలో వున్న ప్రతీ జాతీ, యుద్ధం చేయకూడదనీ, దానివల్ల చాలా కష్టనష్టాలు వున్నాయనీ అనుకుంటూనే వుంటుంది. కాని తప్పనిసరి కర్మక్రింద ప్రపంచంలోని ప్రతి ప్రాణీ ఏ క్షణాని కా క్షణం యుద్ధరంగానికి నడచి తీరవలసిన దుస్థితిలోనే వుంటున్నాడు. ఈ స్థితిలో తాటస్థ్యం అనేది అసంభవ కార్యం." - తెన్నేటి సూరి (ఛెంఘిజ్ ఖాన్ నవల, కరాచర్ పాత్ర, పేజీ.79)
  • పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా/అడవి నీతి మారిందా ఇన్ని యుగాలైనా/వేట అదే వేటు అదే నాటి కథే అంతా నట్టడువులు నడివీధికి నడిచొస్తే వింతా/ బలవంతులె బతకాలని సూక్తి మరవకుండా శతాబ్దాలు చదవలేద ఈ అరణ్యకాండ? - సిరివెన్నెల సీతారామశాస్త్రి (గాయం సినిమాలో ‘‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’’ పాటలో)

  • యుద్ధంలో గెలవడమంటే శత్రువుని చంపడం కాదు. ఓడించడం. ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. చంపడం కాదు. - త్రివిక్రమ్ శ్రీనివాస్ (జల్సా సినిమా, సంజయ్ సాహు(పవన్ కళ్యాణ్) పాత్ర)
  • తననే మరచిపోతేగాని యెవడూ యుద్ధరంగంలో వురకలేడు. - సుబ్రహ్మణ్యశాస్త్రి (టీపార్టీ)
  • రక్తం పంచుకు పుట్టినవాళ్ళే మనవాళ్ళేనని అనుకుంటే/ కురుక్షేత్ర రణరంగ దృశ్యమే నవ్వులపాలై పోయేది కదా/ కౌరవులెవరో పాండవులెవరో ఆలోచించేలోగా తలతెగి మొండెం వేరై రక్తం ఏరై మోడైపోయే చితుకుల బతుకులు అరెరెరె - సిరివెన్నెల సీతారామశాస్త్రి ("మర్యాద రామన్న" సినిమాలో అరెరెరె అరెరెరె ఎంతటి ఘనమయ్యా పాట)
  • పురోగమనం మనిషి యుద్ధాల వల్లనే సాధించాడు. వేదాంతాన్ని యుద్ధంలోనే సృష్టించాడు. - బలివాడ కాంతారావు (వంశధార కథ)
  • యుద్ధ నిర్వహణ ఒక కళ. విశిష్టమైన కళకు ప్రయోజనమంటూ ఏదీ వుండరాదనే విశ్వాసం వున్ననాడు, ‘కళకోసమే కళ’ - యుద్ధం కోసమే యుద్ధం. - తెన్నేటి సూరి (ఛెంఘిజ్ ఖాన్ నవలలో)
  • కవిత్వము, సంగీతము, వైద్యము నెట్టిదో యుద్ధనీతియూ నట్టిదే. అందఱకు తెలిసినట్లుండును. - విశ్వనాథ సత్యనారాయణ (బద్దన్న సేనాని నవలలో)