Sunday 11 January 2015

గోపాల గోపాల

గోపాల గోపాల సినిమా 2015 జనవరి 10న సంక్రాంతికి విడుదలయ్యింది. హిందీలో ఓమైగాడ్ అంటూ అందర్నీ కంగారు పెట్టిన కథనే తీసుకుని రీమేక్ చేసిన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో వెంకటేష్ నటించగా, ప్రత్యేక ఆకర్షణగా కృష్ణుడి పాత్రలో పవన్ కళ్యాణ్ మెప్పించారు. సినిమాలో పేలిన డైలాగులు, ‘‘సాంబా రాస్కోరా’’ అనదగ్గ కొటేషన్లు చాలానే వున్నాయి. అందులో కొన్ని ఇవి:

కృష్ణుడిగా పవన్ కళ్యాణ్



  • నేను టైమ్ కు రావటం కాదు మిత్రమా...నేను వచ్చాకే టైమ్ వస్తుంది.
  • కొన్ని సార్లు రావడం ఆలస్యం కావచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా 
  • వేగం బండిలో కాదు మిత్రమ... దాన్ని నడిపేవాడి నరంలో ఉంటుందీ!
  • సమర్థులు మాకెందుకని ఇంట్లో కూర్చుంటే, అసమర్థులే చివరకి రాజ్యమేలతారు.
  • దారి చూపించడం వరకే నా పని. గమ్యాన్ని చేరుకోవడం నీ పని
  • బరువు చూసే వాడికి కాదు మిత్రమా...మోసే వాడికి తెలుస్తుంది.

గోపాలరావుగా వెంకటేష్

  • మనిషి దేవుడ్ని రాయిగా మార్చాడు, దేవుడే కనుక ఉంటే మనిషిని మనిషిగా మార్చమనండి చాలు.

సంభాషణలు


  • ‘‘ఆ కృష్ణుడు మాత్రం ఏం చేశాడు. తనను దేవుడని నమ్మిన బావమరిదితో బంధువులందరినీ నరికించాడు’’ అంటూ గోపాలరావు(వెంకటేష్) ఆవేశంగా నిందిస్తూంటే నిబ్బరంగా కృష్ణుడు(పవన్ కళ్యాణ్) ‘‘ధర్మం. అదే ధర్మం. ఒక ఆడదాన్ని నిండు సభలో బట్టలూడదీస్తూంటే ఎదిరించగలిగీ, ఎదురుతిరగని ప్రతివాడూ చావాల్సిందే.. భీష్ముడితో సహా. అదే ధర్మం. ఒక్క అశ్వత్థామ మాత్రం ఇది తప్పు అని ఎదిరించి, సభలో ఉండలేక వెళ్ళిపోయినందుకు బతికిపోయాడు. ఇదీ ధర్మం.’’

పవన్ కళ్యాణ్ సంభాషణలు రాజకీయమైనవా?

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గోపాలుడి పాత్ర వేసి అర్జునుడి లాంటి గోపాలరావుకు గీతోపదేశం చేస్తాడు. ఆ క్రమంలో వచ్చిన వీలు చూసుకుని కర్తవ్యబోధ చేసే డైలాగులు చాలానే పేల్చారు. దాంతో కొన్ని పత్రికలు ఇవి రాజకీయమైనవని కోడై కూస్తున్నాయి. సమర్థులు రంగంలోకి దిగాలని, లేకుంటే అసమర్థులు రాజ్యమేలతారని చెప్పిన డైలాగే కాక దారి చూపడం వరకే నా పని, ఆపైన చేరుకోవడం నీ పనేననడం దీనికి కారణమౌతున్నాయి. ఇక రాజకీయాలే కాక రావడం ఆలస్యమైనా వచ్చేది మాత్రం పక్కా అన్న డైలాగ్ ఆలస్యంగా వస్తూన్న గబ్బర్ సింగ్2 గురించి అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తించేందుకేనని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా వ్యంగ్యాన్నే అస్త్రంగా చేసుకున్న ఈ సినిమాకు డైలాగులే బలంగా నిలుస్తున్నాయి.
(గమనిక: పై డైలాగులు సినిమా నుంచి నేరుగా రాసినవి కాదు. వీటికీ సినిమాలోని డైలాగులకీ కొద్దిగా తేడాలు ఉంటే ఉండొచ్చు. ఇక ఈ డైలాగులు వాడడంపై సినిమావారికేమైనా అభ్యంతరాలుంటే కామెంటు రూపంలో సంప్రదిస్తే పోస్టు తొలగించబడును.)

No comments:

Post a Comment